విజయవాడ యువకుడు సాయికృష్ణ అదృశ్యం కేసు.. శ్మశానవాటికలో పోలీసుల సోదాలు
- సంచలనం రేపుతున్న సాయికృష్ణ అదృశ్యం కేసు
- స్వర్గపురి శ్మశానవాటికలో మే 24న రెండు శవాలను దహనం చేయడంపై పోలీసుల ఆరా
- ఎలక్ట్రిక్ దహనాలు చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
విజయవాడలో తీవ్ర సంచలనం రేపుతున్న 23 ఏళ్ల యువకుడు సాయికృష్ణ అదృశ్యం కేసు.. మలుపులు తిరుగుతూ ‘స్వర్గపురి’ శ్మశానవాటికకు చేరింది. సాయికృష్ణను హత్య చేసి, అతని డెడ్‌బాడీని స్వర్గపురిలో గుట్టుచప్పుడు కాకుండా దహనం చేశారనే ఆరోపణల నేపథ్యంలో... పోలీసులు అక్కడకు వెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు.
మే 23వ తేదీ రాత్రి 8 గంటలకు గుర్తు తెలియని మృతదేహాలను శ్మశానవాటికకు తీసుకు వచ్చినట్టు సిబ్బంది చెబుతున్నారు. మే 24న వాటిని దహనం చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రికార్డుల్లో మృతదేహాలు 40 ఏళ్లకు పైబడిన వారివిగా ఉన్నాయి. సాయికృష్ణలాంటి యువకుడి దహన రికార్డులు ఎక్కడా లేవు.
ఈ వ్యవహారంలో స్వర్గపురిలో ఎలక్ట్రిక్ దహనాలు నిర్వహించే ‘బాషా’ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఐ పవన్ కిశోర్ అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకుని లీగల్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.